45 రోజులు
66 కోట్ల 30 లక్షల భక్తుల పుణ్యస్నానాలు
350 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
144 సంవత్సరాల తరువాత జరిగిన మహాకుంభమేళా పరిసమాప్తమైంది
గ్రహాల అపూర్వ కలయికతో ఏర్పడిన కుంభమేళా అపూర్వ ఆధ్యాత్మిక సమ్మేళనం
త్రివేణి సంగమం నుంచి జలం తెచ్చిన వారిని గ్రామాల్లో అపురూపంగా చూసుకున్నారు
ఎన్నో రికార్డులు సృష్టించి ముగిసిన మహా కుంభమేళా తరువాత జనం దృష్టి ఇప్పుడు ఆలయాలు, ఆధ్యాత్మిక యాత్రల వైపు మొగ్గుతున్నది. 66 కోట్ల 30 లక్షల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ సందర్శించడం, తొక్కిసలాటలు, ట్రాఫిక్ జామ్, రోడ్డు ప్రమాదాలు జరిగినా వెరవకుండా జనం వచ్చి స్నానాలు చేశారు. దేశ విదేశాలకు చెందిన భక్తులతో పాటు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి స్నానాలు చేయడం చెప్పుకోదగ్గ విశేషం. దీనికంతటికీ కారణం ఆలయాల సందర్శన పట్ల జనం ఆసక్తి చూపడమే.
గత కొద్ది సంవత్సరాలుగా ఆలయ పర్యాటక రంగం విస్తరిస్తున్నది. దీనిలో వివిధ పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీల పర్యవేక్షణలో జరిగే ప్యాకేజీ టూర్లు ఉంటాయి. సాధారణంగా ఆయా ప్రాంతంలో జరిగే ఉత్సవాలతో కలిపి టూర్లు నిర్వహిస్తుంటారు. టూర్ వెళ్లిన ప్రాంతంలో ఆలయాల సందర్శనతో పాటు సైట్ సీయింగ్ కూడా ఉంటుంది. పర్యటక రంగం విస్తరణ దేశ ఆర్ధిక రంగానికి దన్నుగా నిలుస్తోంది.
మన దేశంలో ఆలయాల సందర్శనతో పాటు శిల్పకళలను చూసేందుకు విదేశీయులు మన దేశానికి ఎప్పటినుంచో వస్తున్నారు. కుంభమేళాలకు ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఈ సారి వారి రాకడ బాగా పెరిగింది. పాకిస్థాన్ నుంచి కూడా ప్రత్యేకంగా వీసాలు చేయించుకొని మహాకుంభమేళాకు వచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. ఆలయ పర్యాటకం అంటే అది మత విశ్వాసాలకు సంబంధించినది. ఆధ్యాత్మిక భావనతో యాత్రలు చేయడం. చారిత్రక కట్టడాలను, కళాఖండాలను సందర్శించడం.
ఆలయ పర్యాటకం అంటే ప్రజలు తాము సాధారణంగా నివసించే ప్రాంతం నుంచి చార్ ధామ్, అమర్నాథ్, వైష్ణోదేవి, తిరుపతి, పూరీ జగన్నాధ్, కలకత్తా కాళీ, జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాల వంటి చోట్లకు వెళ్లడం వంటివి ఉన్నాయి.మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో రెట్ల మంది సామాన్యులు, మాన్యులు ప్రయాగ్ రాజ్ సందర్శించడం వల్ల స్థానికంగా ఉండే టూర్ ఆపరేటర్లు, టాక్సీ డ్రైవర్లు, పడవలు, స్టీమర్లు నడిపే వారు సొమ్ముచేసుకున్నారు. నలభై ఐదు రోజుల్లో పది లక్షలకన్నా ఎక్కువ సంపాదించుకున్నానని ఒక టూర్ ఆపరేటర్ వెల్లడించారు.
ఆయా సీజను అనుసరించి ఆలయాల సందర్శన జరుగుతుంది. నగరానికి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీ వారు జనవరిలో రామాయణ్ యాత్ర కూడా నిర్వహించారు. దాదాపు ముప్పై మంది ఈ యాత్రకు వెళ్లి వచ్చారట. సీనియర్ సిటిజన్ల కన్నా ఎక్కువ మంది యువత ఈ యాత్రకు వెళ్లారు. అదే విధంగా మహా కుంభమేళాకు కూడా అధిక సంఖ్యలో యువత హాజరుకావడం హర్షణీయం.
హైదరాబాద్ నుంచి నలుగురైదుగురు కలసి కార్లలో వెళ్లిరావడం, ముంబైకి చెందిన ఒక జంట మోటారు బైక్ మీద 1200 కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాగ్ రాజ్ చేరడం సాహసమే.
దశాబ్దాలుగా మనం వెళ్లి చూస్తున్న ఆలయాలకు తోడుగా ఇప్పుడు కొత్త చోట్లకు ఆపరేటర్లు టూర్లు తీస్తున్నారు. ఇక బయలుదేరడమే తరువాయి.