శివరాత్రి అనగా మనస్సు కైలాసం నుంచి అన్ని దేవాలయాలు మనో నేత్రం తో వీక్షించి సంబరపడిపోతుంది.
ప్రపంచంలో ఏ మూలకు ఉన్న తెలుగువారైనా కృష్ణా, గోదావరి నదుల్ని ఆరాధించినంతగా ఏ నదినీ అభిమానించరు.
గంగమ్మ తరువాత వారు ప్రాణప్రదంగా ఈ రెండు నదులనే ఆదరిస్తారు. పూజిస్తారు. జీవిత యానం ప్రారంభం నుంచి జీవిత గమనంలో చివరి మజిలీ వరకు గోదావరి, కృష్ణా నదీ తీరాలలో గడపాలని ఆకాంక్షిస్తారు. ఆ రెండు నదులు ఆధ్యాత్మికతకు నేత్రాలు.
అన్ని దేవాలయాలు ఈ నదీమతల్లుల చెంత ప్రతిష్ఠితమయ్యాయి. సాయినాథుని నిలయం నుంచి అంతర్వేది తీరం వరకు సమస్త దేవతలు గోదావరి తీర ఆలయాలలో కొలువై ఉన్నారు. మహాబలేశ్వరం నుంచి హంసలదీవి వరకు అన్ని క్షేత్రాలు పూజలందుకోవడం చూసి కృష్ణమ్మ పరవశంతో పరవళ్ళుతొక్కుతుంటుంది.
రెండు నదులు కృష్ణ, గోదావరి వరుసగా బ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి, వీరభద్ర సమేత భద్రకాళిని సొంతం చేసుకున్నాయి. రెండు క్షేత్రాలు శిఖరాగ్రంలో ఉండటం వాటి ప్రత్యేకత.పంచారామ క్షేత్రాలలో ఒకటిగా నిలిచిన పట్టిసీమ గురించి ముందుగా స్మరించుకుందాం. పట్టిసీమ క్షేత్రం ఆలయాన్ని వెండితెర కెమెరా కన్ను అందంగా బంధించింది. హర ప్రియుడు కళాతపస్వి విశ్వనాథ్ తన చిత్రాలకు గోదావరి తీరాన్ని వేదిక చేసుకున్నారు.
పట్టిసీమ గురించి దేశ విదేశాలలో పలువురికి పరిచయం అయ్యింది విశ్వనాథ్ చిత్రాల వల్లనే. తెరచాప ఊసులు చెబుతుంటే, అపురూపంగా గోదావరి ఇసుక తిన్నెల మీద నడిచి, ఒక్కసారి కొండ మీద ఉన్న శివయ్యను చూసినప్పుడు మనస్సు మురిసిపోతుంది.
పట్టిసీమ అనుభూతి నిజంగా చంద్రోదయ స్పర్శ. వెండితెర వెలుగులో మరింత మెరిసింది. సౌందర్యానికి భాష ఉంటే పట్టిసీమ అపురూపాలు మనకు వివరించేది. కెమెరా కన్ను శివాలయం శిఖరాలపై పాడినప్పుడు ఇవన్నీ సుదూర తీరం నుంచి మనల్ని మరో ప్రపంచం వైపు నడిపిస్తాయి. గుడికి అవతల ఒక గ్రామం ఉంది. తెలిసి అందరికీ విస్మయం కలుగుతుంది. పట్టిసీమ పర్యాటక స్వర్గసీమ.
గోదావరి తీరం నుంచి మనం కృష్ణా తీరం వైపు వెళ్ళినప్పుడు మల్లన్న రూపుదాల్చిన శివయ్య కొలువైన శ్రీశైలం నిజంగా ప్రకృతి స్వర్గధామం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారి పొడవునా అడవులు. ఆకుపచ్చని వనాల మధ్య నుంచి ఆధ్యాత్మికత వైపు సాగే ప్రయాణం అద్వితీయం.
శివయ్య సాన్నిధ్యాన్ని చేరాక మనకు కలిగే అనుభూతి అనిర్వచనీయం. చుట్టూ వానలు, కృష్ణమ్మ పరవళ్లు, హరిత శిఖరాలు, ప్రశాంతతకు ప్రతిబింబమైన రహదారులు, నేపథ్యంలో నిశ్శబ్ద సంగీతం ఇవన్నీ శ్రీశైలం పవిత్రతకు సాక్ష్యాలు.విజయవాడ నుంచి వాహనంలో వెళ్లేవారికి శిఖరేశ్వరం, పాలధార, పంచదార, సాక్షి గణపతి, హఠకేశ్వరం కనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి వస్తుంటే వనమే మీకు స్వాగతం పలుకుతుంది. నడిరోడ్డు మీద వానరాలు చూడచక్కని క్రీడలు ఆడతాయి.
శ్రీశైలం ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం మన ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. బ్రమరాంభ, మల్లన్న ఆలయాలు, శివాజీ గోపురం దర్శించుకోవడం తో పాటు కొండ శిఖరంపై నుంచి ఆలయ గోపురం చూడటం మరవలేని అనుభూతి. శ్రీశైలం ఎప్పటికీ ఆధ్యాత్మిక పరిమళ విభూతి. శివపార్వతుల సన్నిధి ఎన్నటికీ తరగని పెన్నిధి.
— డా.దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ,
అధ్యాపకులు, పరిశోధకులు.