ఎండలు ముదురుతున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఎండ తీవ్రత వల్ల పెద్దలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటికి రాలేక పోతున్నారు. మరోవైపు పిల్లలకు పరీక్షల సీజను. దాంతో స్కూల్ పిల్లలకు ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. మార్చి 15వ తేదీన ప్రారంభమైన ఒంటిపూట బడులు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించింది.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బడులు ఉంటాయి. విద్యార్థులకు 12.30 మధ్యాహ్న భోజనం అందించాలని కూడా ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ ఆదేశాలు అన్ని యాజమాన్యాలు ఖచ్చితంగా అమలు చేసేలా ప్రాంతీయ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా విద్యాశాఖ ఉత్తర్వులో పేర్కొన్నారు.
మరో వైపు పదవ తరగతి విద్యార్థులను బోర్డు పరీక్షలకు తయారు చేసేందుకు ప్రత్యేక తరగతులు కొనసాగిస్తారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం కూడా పనిచేస్తాయి. మార్చి మొదటి వారంలోనే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒంటిపూట బడుల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒంటిపూట బడులు నడపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ ఏడాది వేసవి తీవ్రంగా ఉంటుందని, అందులోనూ మార్చి మూడవ వారం నుంచి మే నెల వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఫిబ్రవరి చివరి వారంలోనే హెచ్చరించింది. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మార్చి మూడవ వారం నుంచి వడగాలులు తమ ప్రతాపం చూపడం తథ్యం. ఈ నేపథ్యంలో సూర్య ప్రతాపాన్ని తట్టుకోవడానికి ఏం చేయాలో ఆలోచించుకుంటూ జనం సన్నద్ధమవుతున్నారు.
మార్చి 15 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పాఠశాలలు ఉదయం 8 నుంచి 12.30 వరకు ఉంటాయి. ఏప్రిల్ 23 తరువాత వేసవి సెలవులు ప్రకటిస్తారు. వేసవి సెలవులు ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు నిర్ణయించారు. కొత్త విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రారంభం కానుంది. తెలంగాణలో ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. తొందరలోనే అవి పూర్తవుతాయి. 21 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎస్ ఎస్ సి పరీక్షలు జరుగుతాయి.