తెలుగు సినిమాలలో ప్రేమ, వినోదంతో పాటు భక్తి భావన కూడా ప్రేక్షకులను రంజింపజేశాయి. భక్తి, ప్రశాంతత భావోద్వేగాలతో కూడిన కథలు ప్రేక్షకులలో ఆధ్యాత్మికతను పెంచాయి. పౌరాణిక చిత్రాలతో పాటు పలు సాంఘిక చిత్రాలలో కూడా శివతత్వం అంతర్లీనంగా ఉండటం గమనార్హం. శివుడు అనగానే అప్పటి తరం ప్రేక్షకులకు కళాతపస్వి విశ్వనాథ్ గుర్తుకు వస్తారు. విశ్వనాథ్ నిజంగానే వెండితెర విశ్వనాథుడు. ఆయన 1960లో రూపొందించిన చిత్రాలలో శివతత్వం పాటలు, దృశ్యాలు, కథ, కథనాలు అన్నింటిలో ప్రారంభం నుంచి చివరి వరకు కనిపిస్తుంది.
సిరిసిరి మువ్వ చిత్రంలో నాట్యాన్ని ఆరాధించే నిర్మల హృదయం వేదన పడినప్పుడు రారా దిగిరా దివి నుంచి భువికి దిగిరా అని ఉద్వేగ భరితంగా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి సృజనకు నిలువెత్తు రూపంగా ఎదిగిన శంకరాభరణం చిత్రంలో వేటూరి కలం నుంచి సంగీత విద్వాంసుడి ఆవేదనను శంకరశాస్త్రి పాత్ర ద్వారా ‘శంకరా నాద శరీరాపరా’ అని అక్షర రూపంలో మనకు వినిపించారు.
తర్వాత కాలంలో విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సప్తపది చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరావతి వద్ద జరిగింది. కథానాయకుడితో సమాన ప్రాధాన్యత కలిగిన పాత్ర శివాలయ అర్చకుడిగా ఉంటుంది. సాగర సంగమం చిత్రంలో ఓం సమశ్శివాయ పాత చిత్ర కథ, కథనాల్ని మలుపు తిప్పింది. శివుడిని నూటికి నూరుపాళ్లు మనస్సాక్షిగా కె. విశ్వనాథ్ కొలిచేవారు.
శృతి లయాలు, సిరివెన్నెల చిత్రాలు ఉత్తరాది పుణ్యక్షేత్రాలైన సారనాథ్, రిషికేష్, గయా, ప్రయాగతో పాటు కాశీలో కూడా చిత్రీకరించారు. ఇక పాటల వెన్నెల సిరివెన్నెల సీతారామశాస్త్రి పరిచయం అయ్యింది గంగావతరణం రూపకం ద్వారా. సిరివెన్నెల చిత్రంలో ఆదిభిక్షువు పాట ద్వారా శివుడి నిందాస్తుతి జరిగింది. స్వర్ణ కమలం చిత్రంలో కథానాయకిలో పరివర్తనను ఓం నమశ్శివాయ పాట ద్వారా శివతత్వాన్ని అద్భుతంగా సిరివెన్నెల రచనలో పలికించారు.
ఆయన చిత్రాలలో ప్రత్యేకంగా చెప్పవలసింది 1980 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైన సంగీత ప్రాధాన్యత గల శంకరాభరణం చిత్రం. మార్చి 14వ తేదీ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన ‘మామ’ కె.వి. మహదేవన్ జయంతి. జె. వి. సోమయాజులు, మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ ముఖ్యపాత్రలు పోషించారు. కె. వి. మహదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. పేరు ప్రఖ్యాతులు పెద్దగా లేని నటీనటులు, ఎలాంటి కమర్షియల్ హంగులు లేని ఈ చిత్రం ఘనవిజయం సాధించి ఒక సంచలనం సృష్టించింది.
ఈ చిత్రం విజయంతో అటు దర్శకుడు విశ్వనాథ్ కళా తపస్విగా పేరుపొందారు. ఈ సినిమాతో గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా రంగంలో సుస్థిర స్థానం పొందారు.