జై చిరంజీవా.. చిరంజీవి అన్న పదం ఒక ఆశీర్వచనం మాత్రమే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సుపరిచితమైన పేరు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించి తన నటనా ప్రతిభతో పద్మవిభూషణుడయ్యారు. నట జీవితంలో అందుకున్న పురస్కారాల కుమించి నాలుగు దశాబ్ధాలుగా ‘చిరంజీవి’ తెలుగు వారి ఆరాధ్య కళాకారుడు, నిత్యం శ్రమించే వారికి, పరిశ్రమించే వారికి నిత్య స్పూర్తి, కళామాతల్లి ముద్దుబిడ్డ. ‘చిరు’ ప్రతిభకి గుర్తుగా 150కి పైగా చిత్రాలని వెండితెర మనకు అందించారు. చిరంజీవి తన నట జీవితంలో ఓ 10 సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నారు. ఆ తరువాత ఆయన మనస్సు మళ్ళీ సినీ రంగం వైపు ప్రయాణించింది.
చిరంజీవి సినిమా జీవితంపై పుస్తకాలు వచ్చినప్పటికీ విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. గంగని తెచ్చే ప్రయత్నంలో భాగంగా ‘భగీరధుడి’ కృషిలా తనకి తాను తారగా ఎదిగే కృషిలో నిత్యం శ్రమించారు. చిరంజీవి కొత్త తరహాలో చేసే నృత్యాభినయం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. సినిమాల్లో పాటలు విరామంగా భావించే దశ నుంచి పాటల కోసం చిరంజీవి సినిమాలకు వెళ్లే స్థితిని కల్పించారు.
చిరంజీవి నటనలో శిక్షణ పొందారు. కమల హాసన్, రజనీకాంత్, నాజర్, రాజేంద్రప్రసాద్ వంటి గొప్పతారలు వీరి సహవిద్యార్థులు. ప్రారంభంలో చిరంజీవి విశ్వనాథ్, బాపు వంటి దర్శకుల వద్ద నటించారు. ఖైదీ చిత్రంతో చిరంజీవి కెరీర్ మలుపు తిరిగింది. దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు, బాలచందర్ వంటి దర్శకులు చాలా కాలం తరువాత అవకాశం ఇచ్చారు. దర్శకులు కోదండరామిరెడ్డి సాహచర్యంలో 30 పైగా చిత్రాలలో నటించారు. ఇది ఎవ్వరికి దక్కని అరుదైన అవకాశం.
జయసుధ, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి, సుహాసిని, భానుప్రియ, రమ్యకృష్ణ, శోభన, సౌందర్య, తమన్నా, కాజల్, సుమలత, త్రిష, నయనతార, సిమ్రాన్, శృతిహాసన్, జ్యోతిక ఇలా అన్ని తరాల కథానాయికలతో నటించారు. రావుగోపాలరావు, సత్యనారాయణ, అమ్రీష్ పురి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి ప్రతినాయకులతో పోటీ పడి వెండితెరను ఆవిష్కరించారు. సత్యానంద్ నుంచి పరుచూరి, త్రివిక్రమ్ లాంటి రచయితల వద్ద పనిచేశారు. నవతరం దర్శకులు విజయ భాస్కర్, వినాయక్, శ్రీను వైట్ల, బాబి వంటి దర్శకులకు అవకాశం కల్పించారు.
చక్రవర్తి, ఇళయరాజా, కె.వి.మహాదేవన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల రాగాలకు పాదాలు కలిపారు. సలీం, తార, ప్రభుదేవ, లారెన్స్ నృత్యాలకి జీవం పోసారు. నిర్మాతలు రామానాయుడు, ఎం.ఎస్.రెడ్డి, అరవింద్, క్రాంతికుమార్, మైత్రి సంస్థలు వద్ద కథానాయకుడిగా తన సహకారం అందించారు.
చిరంజీవి చిత్రాల సంఖ్య 150 పైగా చేరింది. నంది అవార్డులు పొందారు. స్వయం కృషి, అపద్భాందవుడు, రుద్రవీణ, స్టాలిన్ చిత్రాలు మంచి కథాబలం ఉన్న సందేశాత్మక చిత్రాలు. ఠాగూర్ చిత్రం రాజకీయాల వైపు నడిపించింది. సమకాలీన సమస్యలపై స్పందింపచేసింది. చిరంజీవి చిత్రాల సంఖ్య ఇటీవల బాగా తగ్గింది. ఒక విధంగా ఆయనే తగ్గించారని చెప్పాలి. తన కథలు, కథనాలు కొత్తగా ఉండాలని నిత్యం భావిస్తుంటారు.
విశ్వంభర చిత్రం తరువాత, అనిల్ రావిపూడి, ఓదెల శ్రీకాంత్ కథలు చేయడానికి అంగీకరించారు. పాత్ర బలంగా ఉండాలని చిరంజీవి ఆకాంక్షిస్తారు. 2009-2017 వరకు సినిమాలుకి దూరంగా ఉండి, రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. సున్నిత మనస్కులకు రాజకీయాలు అంతగా రుచించవు, అందుకే తిరిగి ఖైదీ నెంబరు 150 ద్వారా నేటి తరానికి పరిచయం అయ్యారు. సైరా, వాల్తేరు వీరయ్య చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు.
బుధవారం మార్చి 19న చిరంజీవి బ్రిటన్ పార్లమెంట్ పురస్కారం అందుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం. ఎంత ఎత్తుకు ఎదిగినా, వినయం వీడని వ్యక్తిత్వం, పసిబాలుడి మనస్తత్వం, అందరినీ ప్రేమించే మనస్సు చిరంజీవిది. ఈ పురస్కారం అందుకుంటున్న సందర్బంగా అభినందనలు.
డాక్టర్ డి.వి.ఎస్.ఎస్.శర్మ, అధ్యాపకులు – సినీ పరిశోధకులు