ఇవి సున్నితంగా మనస్సును తాకి చిత్ర విచిత్రమైన అనుభూతిని సృష్టిస్తాయి. ఒక్కొక్క పాట వింటున్నప్పుడు రచయితకు మనుష్యుల తాలూకు మనస్సుపై ఎంత విస్తృతి ఉంది అనే విషయం అర్ధం అవుతుంది. ఇంత అందంగా రెప్పల వెనుక స్వప్నాలను వర్ణించడం కేవలం సిరివెన్నెలకే సొంతం. రచయిత అక్షర సమయస్ఫూర్తి ప్రతిభా కీర్తి.
నిరాశలో ఉన్న కథానాయిక పరోక్షంగా ధైర్య వచనం చెపుతూ ‘చూడునా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం’ అని రచయిత రాయడం ప్రశంసనీయం. ప్రేమ జంట ఆయన కలం నుంచి జాలువారిన అక్షర సంపద తెరపై అందమైన దృశ్య భావోద్వేగాలుగా మనల్ని పలకరిస్తాయి.
సంతోషం చిత్రంలోని పాటల రాగ మాధుర్యం మనల్ని పసిపాపలా తన అక్షర ఊయలలో లాలిస్తుంది.
‘నే తొలిసారిగా కలగన్నది నిన్నే గదా’ అన్న పదాలలో పాట తాలూకు స్పర్శ మనల్ని చేరుతుంది. ఇది ఆర్తి చెందిన హృదయం నివేదనకు సంతకంలా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని ప్రశ్నిస్తున్న ఈ పదాలు అంతరంగంలో నుంచి పెల్లుబికిన అక్షర గంగలా మనల్ని తాకుతాయి.
‘స్వప్నమా నువ్వు సత్యమా’ అని ప్రశ్నించడం వేదనలో ఉన్న తీవ్రతను విశదీకరిస్తుంది. స్నేహం గురించి ఆమె ఆంతరంగ స్పందన బాధాతప్త హృదయాల్ని ఆవిష్కరిస్తుంది. స్నేహం గొప్పదనాన్ని సిరివెన్నెల మనకు అర్ధవంతంగా చెప్పారు. పాటల కోసం ఆయన ఎంపిక చేసుకున్న పదాలన్నీ ఆయన మనస్సు లోగిలిలో నుంచి జాలువారిన అమృత బిందువులుగా అందరికీ అనిపిస్తాయి.
సంతోషం చిత్రం పాటలు ఎప్పుడు విన్న, ఒకింత సంతోషం, విచారం రెండూ కలసి మనల్ని ఆ పాటల ప్రపంచంలోకి నడిపిస్తాయి.
—- డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ.
అధ్యాపకులు, సినీ పరిశోధకులు.