తొమ్మిది నెలల అంతరిక్షవాసం ముగించుకొని బుధవారం తెల్లవారుజామున క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన సునీతకు స్వాగతం! సుస్వాగతం!!.
భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ రోదసీ కేంద్రం ఐ ఎస్ ఎస్ కమాండర్ విధులను సునీత గత 286 రోజుల పాటు నిర్వహించారు. ఎనిమిది రోజుల్లో తిరిగి రావలసిన సునీత బృందం వారు ప్రయాణించవలసిన స్పేస్ క్రాఫ్ట్ ‘స్టార్ లైనర్’లో ఏర్పడిన సాంకేతిక చిక్కుల కారణంగా స్టార్ లైనర్ ఖాళీగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.
బోయింగ్ సంస్థ జరిపిన అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 5 జూన్ 2024న వారు అక్కడికి చేరుకున్నారు. అనూహ్యంగా తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండవలసి వచ్చినా సునీత ధైర్యంతో పనులు చేసుకుంటూ మధ్య మధ్య కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ చేస్తూ టచ్ లో ఉన్నారు.వ్యోమగామిగా ఎన్నో విజయాలు సాధించిన సునీత భారత సంతతికి చెందినవారు.
ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు.తల్లి బోనీ జలోకర్ స్లోవేనియా దేశస్థురాలు. సునీత ఈ విధంగా అంతరిక్ష కేంద్రంలో ఉండటం ఇది మూడవసారి.మొదట 2006లో ఆర్నెల్లు, 2012లో నాలుగు నెలలు ఉన్నారు. కాగా సునీత బృందం ప్రయాణిస్తున్న క్రూ డ్రాగన్ వ్యోమ నౌక 17 గంటల ప్రయాణం పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఆమె సొంత గ్రామం మెహసానా (గుజరాత్) జిల్లా జులాసన్ లో ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహించారు.
సునీత బృందం ప్రయాణించిన క్రూ డ్రాగన్ బయలుదేరినప్పటి నుంచిఫ్లోరిడా వద్ద బుధవారం సముద్ర జలాలను తాకేంతవరకు నాసా (అమెరికా అంతరిక్ష కేంద్రం) ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇప్పుడు భూమి వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా నాసా వైద్యుల పర్యవేక్షణలో సునీత బృందాన్ని హూస్టన్ లోని రోదసీ కేంద్రంలో ఉంచుతారు. భూ గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడి ఆరోగ్యం కుదుటపడ్డాక వారిని ఇతరులతో కలవనిస్తారు. సునీత, విల్మోర్ తదితరులు సముద్ర జలాల్లో దిగినప్పుడు ఆ చుట్టుపక్కల డాల్ఫిన్లు చక్కర్లు కొట్టడం కనిపించింది. గుంపులుగా డాల్ఫిన్లు రావడం అవి కూడా సునీత బృందానికి స్వాగతం చెప్పాయని జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్షం నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన ‘భారత పుత్రిక’ సునీత విలియమ్స్ కు జాతి జనులు అభినందన సందేశాలు పంపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఈశాన్య రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇంకా పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్య మంత్రులు కూడా స్వాగతం చెప్తూ అభినందన సందేశాలు పంపారు.