నేటితో కుంభమేళా పరిసమాప్తి

నలభై ఐదు రోజులుగా జోరుగా సాగుతున్న కుంభమేళా ఈ రోజు శివరాత్రి పర్వదినంతో ముగుస్తోంది. శివరాత్రి రోజు చివరి అమృత స్నానంతో గ్రహాల అద్భుత కలయికతో ఏర్పడిన మహా కుంభ మేళా ముగిసే తరుణం నెలలు, వారాల నుంచి గంటల్లోకి వచ్చింది. చినుకు చినుకు కుంభవృష్టిగా మారినట్లు వందలు, వేల నుంచి లక్షలు దాటి ఇప్పటివరకు సుమారు 60 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు చేసినట్లు లెక్కతేలింది. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఒక్క రోజులోనే ఒక కోటి మందికి పైగా వరకు స్నానాలు చేశారని అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు జరుగుతున్నా వెరవకుండా జనం వచ్చి స్నానమాచరించారు. ఒకవైపు తొక్కిసలాట జరిగి ముప్పై మంది మరణించిన రోజున కూడా ప్రజలు పుణ్య స్నానాలు చేయడం మానలేదు.

గత వారం పది రోజులుగా కుంభమేళాను మార్చి వరకు పొడిగిస్తారనే వార్తలు వచ్చాయి. వాటిల్లో నిజం లేదని ప్రయాగ్ రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రకటించారు. కుంభమేళాలో స్నానం చేసిన వారి సంఖ్య అనేక దేశాల జనాభా కన్నా ఎక్కువ. జనవరి 13వ తేదీన ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తోంది. కోట్లాదిమంది వచ్చి చేరుతుండటంతో ప్రయాగ్ రాజ్ లో ప్రధాన కూడళ్ళే కాక చిన్న చిన్న వీధులు కూడా రద్దీగా మారాయి.

గ్రహాల అద్భుత కలయిక వల్ల 144 సంవత్సరాల తరువాత జరుగుతున్న మహాకుంభ్ సందర్బంగా ప్రయాగ్ రాజ్ వస్తున్న యాత్రికులకు ఎన్ని సౌకర్యాలు చేసినా భక్తులకే కాక స్థానికులకు కూడా ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. స్థానికులలో ఒకరిద్దరు ‘చాలు బాబూ ఇక మా నగరానికి రాకండి’ అని సామాజిక మాధ్యమాలలో పోస్టులు కూడా పెట్టారు. అవి వైరల్ అవుతున్నాయి. కుంభమేళా కోసం గత ఏడాది నుంచి ఏర్పాట్లు చేశారు. వాటి కారణంగా నగరవాసులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. రోజురోజుకు జనం రాకడ పెరుగుతుండటంతో తమ పనులు చేసుకోవడం కష్టంగా మారుతోందని స్థానికులు అంటున్నారు.

జనవరి నుంచి స్నానాలు చేయడం కోసం కోట్లాది మంది వచ్చి వెళ్తుండటం వల్ల త్రివేణి సంగమ జలాలు కాలుష్యమవుతున్నాయి. వచ్చినవారిలో చాలా మంది శుచి శుభ్రత లేకుండా ఎక్కడబడితే అక్కడ కాలకృత్యాలు తీర్చుకుండటంతో ఈ నేపథ్యంలో గంగా నది జలాల్లో ప్రమాదకర స్థాయిలో మల కోలిఫామ్ బాక్టీరియా ఉన్నట్లు ప్రభుత్వ సంస్థ గుర్తించింది. ఈ బాక్టీరియా వల్ల వాంతులు, విరేచనాల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అందుకే ప్రయాగ రాజ్ వెళ్లివచ్చిన వారు జీర్ణాశయ సంబంధ అంటువ్యాధులతో సతమతమవుతున్నారు. వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

కుంభమేళా తరువాత తమ దైనందిన అవసరాల కోసం గంగా నది జలాలపై ఆధారపడే స్థానికులకు కూడా సమస్యలు ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పుణ్యస్నానాలు చేసిన ప్రముఖులలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్య అమృత ఫడ్నవీస్, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినీ నటుడు విజయ్ దేవరకొండ ఉన్నారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *